అవోపా బ్యాంక్మన్ చాపుటర్ వారు ప్లవ నామ సంవత్సర ఉగాది కార్యక్రమాలు ఏప్రిల్ 13వ తేదీన వర్చువల్ గా అతి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాలు మొదట శ్రీమతి మణిమాల గారి ప్రార్థనా గీతంతో ప్రారంభం కాగా అధ్యక్షుడు శ్రీ పి.వి రమణయ్య గారు తమ స్వాగతోపన్యాసం లో "గడచిన శార్వరి కమ్మిన చిమ్మ చీకటి నుండి మనందరిని బయటకు తేవడానికి వచ్చిన ఈ ప్లవ నామ ఉగాది రానున్న మంచి కాలానికి శుభ వీచిక" అన్న ఆశాభావాన్ని చిన్న కవిత లో విన్నవిస్తూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొన్న అందరినీ సాదరంగా ఆహ్వానించారు. శ్రీ చిర్రావూరి శివ రామకృష్ణ గారిని శ్రీ రామానందం గారు వేదికకు పరిచయం చేయగా పంచాంగ శ్రవణంతో పాటూ వారి అమూల్యమైన శుభాశిస్సులను సదస్యులకు అందించారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కవితా పఠనం ఉత్సుకతను కలిగించగా, శ్యామల గారి శ్రావ్యమైన గళం తో ప్లవ నామ ఉగాదిని రస రమ్యంగా గజల్ తో శ్లాఘించగా, శ్రీ ఆలపాటి శ్రీ నగేష్ గారు ఉగాది పండుగ వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని, ప్రాశస్త్యాన్ని ప్రాసలతో స్తుతించారు. ప్రముఖ పద్యకవి శ్రీ అన్నమరాజు గారు ఉగాది వేదిక పై సాంప్రదాయ పద్య కవితా ప్రాభవాన్ని చాటగా, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మేల అన్న చందంగా ఆలపాటి వారు వేదిక పై మాటలు రావడం లేదు అంటూనే తనదైన శైలిలో తేనియల వంటి పదాలతో శ్రోతలకు వీనుల విందు చేయగా ఇనంపూడి శ్రీలక్ష్మి గారు కమనీయమైన కవితా మాలికలల్లి కవన వేదికకు వైభవం చేకూర్చారు. ఇక నవ యువ కవి మానాపురం రాజా చంద్ర శేఖర్ పదునైన, పసందైన పదచిత్రాల తో ఆధునిక కవితా ధోరణి లో ఉగాది చిత్రమాలికనల్లగా, రాధాశ్రీ వారి గళం నుండి అనర్గళంగా జాలు వారిన కవితా ఝరులు శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. శ్రీ యల్.వి.యస్.దుర్గా ప్రసాద్ తన వచన కవిత లో ఉధృత ప్రవాహం నుండి దరి చేేర్చు తెప్పలా ప్రస్తుత "వైరసుల వైతరణి" నుండి కూడా నిబంధనల పాటించు నావలో జనులను కాపాడి దరి చేర్చమని "ప్లవ నామ ఉగాదిని" ఉద్వేగంతో వేడుకున్నారు. శ్రీ కె.సి.పి. గుప్త గారు నేటి ఉగాదిని "ప్లవ నామ వత్సరమా స్వాగతం, సుస్వాగత మంటూ మృదు మధుర పదజాలంతో వేదిక పైకి ఆవాహన చేశారు. ఉత్సాహ భరితంగా, ఉద్వేగంగా, రసవత్తరంగా సాగుతున్న కవితా వాహిని లో అవోపా బ్యాంక్మన్ చాపుటర్ కన్వీనర్ హనుమంతరావు గారు తమ స్వీయ కవితని జోడించి సభికులను మరింత ఉత్సాహ పరిచారు. అనేక కళా రూపాలలో, అభినివేశం, అనువాదకురాలిగా విశేష సేవలందించిన నిర్మల గారి నృత్య వీడియో మరియు అలవోకగా చెప్పిన అశుకవుల కవితలు శ్రోతలను ఆనందంలో ఓలలాడించాయి. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు కరోనా వైరస్ నేపథ్యంగా చేసుకుని "కరములను కలుపవద్దని కటువుగా చెప్పినా కష్ట కాలంలో ప్రతి మనిషిలో మమకారానికి, సహకార భావాలకు బీజం వేసిందని కరోనా పై అనుకూల వైఖరి ప్రదర్శించారు. కవితా, గేయ, కథా, నవలా రంగాలలో తన దైన ముద్ర వేసుకున్న శ్రీమతి యలమర్తి అనూరాధ గారు తన వచన కవిత లో "కొత్త భాష్యం" తో ప్లవ ఉగాదికి సరికొత్త భాష్యం చెబుతూ "కోకిల కూ..కూ... రాగాలను ఆస్వాదించడం మాత్రమే కాక అలమటిస్తున్న తోటి మానవుని ఆవేదన అర్థం చేసుకోవాలని, గదిని శుభ్ర పరుచుకున్నట్లే మదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, చెడు పద్దతులను గొఱ్ఱె దాట్లుగా, అనాలోచిత కొట్లాటలు పొట్టేల్లు ఢీ కొనడంలా మాని కష్టాల కడలిలో నుంచి దరి చేర్చే "పడవ" లా తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ సమయోచితంగా మెలగాలన్న సద్భావనలను వెలిబుచ్చారు. శ్రీమతి కవితా అజయ్ గారు తమ వచన కవిత లో మానసిక, శారీరక ఆరోగ్యాల సమతుల్యమే ఎలాంటి కంటక గమ్యాల్నయినా సుగమం చేస్తాయని సున్నితంగా సూచించారు. ప్లవ నామ ఉగాది కవి సమ్మేళనపు పల్లకి ఏ మాత్రం ఒడిదొడుకుల బారిన పడకుండా, అపురూపంగా, అలవోక గా నడవడంలో శ్రీ పి.వి.రమణయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ గార్రే మురళీ కృష్ణ గారు, కోశాధికారి శ్రీ కె.వి.యస్. గుప్త గారు, సహా కన్వీనర్ మద్ది హనుమంతరావు గారు, కన్వీనర్ శ్రీమతి యలమర్తి అనూరాధ గారల కృషి అనన్య సామాన్యం. టి.ఎల్.వి రావు గారు ఈ కవిసమ్మేళనానికి సాంకేతిక సహకారాలు అధ్బుతంగా అందించారు. అవోపా వారు ఇలాంటి విశేష కార్యక్రమాలు మరిన్ని దిగ్విజయంగా నిర్వహించాలని పలువురు ఆశిస్తూ నిర్వాహకులకు పలువురు అభినందనలు తెలిపారు
బ్యాంక్మన్ చాపుటర్ వారి ఉగాది కార్యక్రమాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి